Telangana: హనుమకొండలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ

BJP and TRS Workers Clashed in Hanamkonda

  • హనుమకొండలో ఈ నెల 29న టీఆర్ఎస్ విజయగర్జన సభ
  • భూముల పరిశీలనకు వెళ్లిన టీఆర్ఎస్ నేతలను కలిసిన రైతులు
  • సభ జరిగితే తలెత్తే ఇబ్బందుల గురించి చెప్పిన వైనం
  • రైతులను రెచ్చగొడుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలను నెట్టేసిన టీఆర్ఎస్ శ్రేణులు
  • బలవంతంగా భూములు గుంజుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన బీజేపీ జిల్లా చీఫ్

హనుమకొండ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఈ నెల 15న వరంగల్‌లో విజయగర్జన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే, ఈ నెల 29న దీక్షా దివస్ సందర్భంగా అదే రోజున సభను నిర్వహించాలని నిర్ణయించడంతో సభ తేదీని మార్చారు.

ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య, రెవెన్యూ అధికారులు నిన్న హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట టోల్‌ప్లాజా సమీపంలో భూములను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు, నేతలను కలిసిన స్థానికులు, రైతులు సభ వల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులను విన్నవించారు. నేతలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో అధికారులు, నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికే టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది.

 రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగి నెట్టేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వీరిని శాంతింపజేసేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నించారు. విషయం తెలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మ, ఇతర నేతలు అక్కడికి చేరుకున్నారు. రైతులకు ఇష్టం లేకుండా సభ కోసం బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News