Jagga Reddy: ఒక ఉప ఎన్నికతో ఏం కొంపలు మునుగుతాయని ఓ వర్గం అంటోంది: జగ్గారెడ్డి విమర్శ
- హుజూరాబాద్ ఉపఎన్నికపై టీపీసీసీ సమీక్షా సమావేశం
- మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయిన జానారెడ్డి
- పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న జగ్గారెడ్డి
హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. మరోవైపు ఎన్నిక ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈటలకు కాంగ్రెస్ పార్టీ మద్దతును ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈ పరిస్థితుల్లో ఈరోజు టీపీసీసీ సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. అయితే ఈ సమావేశం మధ్యలోనే సీనియర్ నేత జానారెడ్డి వెళ్లిపోయారు. మరోపైపు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాను ఏదైనా పార్టీ బాగు కోసమే మాట్లాడతానని చెప్పారు.
ఓ ఉపఎన్నికతోనే ఏం కొంపలు మునుగుతాయని పార్టీలోని ఒక వర్గం అంటోందని విమర్శించారు. పార్టీ లోటుపాట్లపై మాట్లాడి తాను నిష్టూరం పడాలనుకోవడం లేదని చెప్పారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తన బలహీనత అని అన్నారు. స్టార్ నాయకులు వెళ్లి ప్రచారం చేస్తేనే హుజూరాబాద్ లో ఓట్లు పడలేదని... తాను వెళితే ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.