TDP: వైసీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడంపై టీడీపీ ఎంపీల స్పందన

TDP leaders responds on YCP MPs meeting with President Of India

  • రాష్ట్రపతితో వైసీపీ ఎంపీల భేటీ
  • పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే శిక్షించేలా చట్టం తేవాలని విజ్ఞప్తి
  • ఏనాడైనా చట్టాలను గౌరవించారా అంటూ కనకమేడల ఆగ్రహం
  • మంత్రుల వ్యాఖ్యలను అందరూ గమనిస్తున్నారన్న కేశినేని

టీడీపీ ఓ టెర్రరిస్టు పార్టీ అని, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవడం తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని స్పందించారు.

ఏనాడూ చట్టాలను గౌరవించని వైసీపీ నేతలు నేడు, చట్టాలు చేయాలంటూ రాష్ట్రపతిని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న విష సంస్కృతికి వైసీపీనే కారణమని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. సంస్కారం, నాగరికత గురించి వైసీపీ సభ్యులు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబును మాట్లాడిన మాటలు ఓసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని సూచించారు. ఏం అర్హత ఉందని చంద్రబాబు గురించి మాట్లాడతారని కనకమేడల ప్రశ్నించారు.

కేశినేని నాని మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం చేయాలని రాష్ట్రపతిని వైసీపీ నేతలు కోరడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష నేత పదవి కూడా రాజ్యాంగబద్ధ పదవేనన్న విషయం వైసీపీ నేతలకు తెలుసో? లేదో? అని వ్యాఖ్యానించారు. అసలు, రాష్ట్రంలో పార్టీ ఆఫీసులపైనా, పార్టీ నేతల ఇళ్లపైనా దాడులు చేసి ఇవాళ రాష్ట్రపతిని ఏ విధంగా కలిశారని కేశినేని నాని నిలదీశారు. వైసీపీ పాలనలో మంత్రులు విపక్షనేతపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News