Hyderabad: మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయం.. పెళ్లి పేరుతో రూ. 17.89 లక్షలు కొల్లగొట్టిన యువతి

Woman Exhort Rs 18 Lakhs from a man in the name of Marriage

  • వధువు కోసం మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రకటన ఇచ్చిన కుమార్
  • ప్రొఫైల్‌తోపాటు మీరూ నచ్చారంటూ అమ్మాయి ఫోన్
  • యూకేలో వైద్యురాలినని నమ్మించిన మాయలాడి
  • కోటి రూపాయల కరెన్సీతో యూకే నుంచి ఓ అమ్మాయి పట్టుబడిందని ఫోన్
  • డబ్బుల ట్రాన్స్‌ఫర్ చేశాక ఫోన్ల స్విచ్చాఫ్

పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సైబర్ మోసాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. మాయమాటలతో మోసపోతున్న అమాయకుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది.  తాజాగా మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన ఓ యువకుడిని ఓ మాయలాడి ఏకంగా రూ. 17.89 లక్షల మేర దోచుకుంది. అంత సమర్పించుకున్నాక కానీ తాను మోసపోయిన విషయం గుర్తించలేకపోయిన బాధిత యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బోయిన్‌పల్లికి చెందిన కుమార్ వధువు కావాలంటూ ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. అతడి ప్రొఫైల్ చూసిన ఓ యువతి కుమార్‌కు ఫోన్ చేసింది. ప్రొఫైల్‌తోపాటు మీరూ నచ్చారంటూ మాటలు కలిపింది. తాను వైద్యురాలినని, ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నానని నమ్మబలికింది. త్వరలోనే హైదరాబాద్ వస్తున్నానని, వచ్చాక పెళ్లి చేసుకుందామని ఊరించింది. ఆ వెంటనే యూకే వెళ్లిపోదామని, వద్దంటే హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరూ వాట్సాప్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటముచ్చట నిత్యకృత్యమయ్యాయి.

ఈ క్రమంలో ఓ రోజు కుమార్‌కు ఫోన్ చేసిన యువతి త్వరలోనే హైదరాబాద్ వస్తున్నానని, వస్తూవస్తూ విలువైన బహుమతి తెస్తానని చెప్పింది. దీంతో కుమార్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ ఆనందం నుంచి అతడు తేరుకోకముందే ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల పేరుతో ఓ ఫోన్ వచ్చింది. యూకే నుంచి వచ్చిన ఓ అమ్మాయి భారత కరెన్సీలో దాదాపు కోటి రూపాయల విలువైన డబ్బు వెంట తెచ్చిందని చెప్పారు. అయితే, కస్టమ్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకపోవడంతో ఆమెను నిర్బంధించామని, ఆమె ఇచ్చిన నంబరు ఆధారంగా మీకు ఫోన్ చేశామని చెప్పారు.

వారు చెప్పింది విని ఆందోళన చెందిన కుమార్ తానేం చేయాలని అడగ్గా ఆమెను వదిలిపెట్టాలంటే రూ. 17.89 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో వెంటనే ఆ మొత్తాన్ని వారు చెప్పిన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన మరుక్షణం నుంచే అమ్మాయితోపాటు, ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పిన వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా స్విచ్చాఫ్ అవడంతో అనుమానించాడు. తాను మోసపోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన బ్యాంకు ఖాతా, నిందితుల ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News