Ghaatak: శత్రువుల గుండెల్లో డ్రోన్ ఘాతం.. మేడిన్ ఇండియా ‘ఘాతక్’ రెడీ.. ఇదిగో వీడియో!

Made In India Ghaatak Drone Tested

  • ఇటీవలే టెస్ట్ చేసిన అధికారులు
  • సాయుధ డ్రోన్ ను తయారు చేసిన డీఆర్డీవో
  • 2024లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి
  • 2009లో ప్రాజెక్ట్ స్టడీ మొదలు
  • డ్రోన్ కు తొలుత ‘ఆరా’గా పేరు
  • ఈ ఏడాది ఫ్లాగ్ షిప్ హోదా

కాలం మారుతున్న కొద్దీ.. యుద్ధ తంత్రాలూ మారుతున్నాయి. వినియోగిస్తున్న ఆయుధాలూ అధునాతనం అవుతున్నాయి. మనవైపు ప్రాణ నష్టం లేకుండా శత్రు దేశాల భరతం పట్టే ఆయుధాల జాబితాలో ‘డ్రోన్లు’ ముందుంటాయి. అన్ని దేశాలూ వాటిని సమకూర్చుకుంటున్నాయి. భారత్ కూడా ఆ జాబితాలో ఉంది. అయితే, దేశీయ పరిజ్ఞానంతో వాటిని రూపొందిస్తోంది. అందులో ఒకటి ‘ఘాతక్’. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) దానికి రూపమిచ్చింది.

ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘాతక్ స్టెల్త్ డ్రోన్ ను ‘స్టెల్త్ వింగ్ ఫ్లయింగ్ టెస్ట్ బెడ్ (స్విఫ్ట్)’ పేరిట దానిని టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది. ఘాతక్ ప్రాజెక్ట్ కు ఈ ఏడాదే ‘ఫ్లాగ్ షిప్’ హోదా ఇచ్చింది. చైనాతో టెన్షన్ల నడుమ దీనిని వీలైనంత త్వరగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024 నుంచి 2025 మధ్య దానిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

ఈ ఘాతక్ డ్రోన్ 30 వేల అడుగుల ఎత్తులో ఎగరగలదని డీఆర్డీవో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రోన్ బరువు 15 టన్నుల లోపే ఉంటుంది. క్షిపణులు, బాంబులు, కచ్చితత్వంతో కూడిన గైడెడ్ మిసైల్స్ నూ దీని ద్వారా ప్రయోగించేందుకు వీలుంటుంది. 2007లోనే ఈ ప్రాజెక్ట్ పై చర్చ మొదలైంది. దానికి అటానమస్ అన్ మ్యాన్డ్ రీసెర్చ్ ఎయిర్ క్రాఫ్ట్ (ఆరా) అని పేరు పెట్టారు. ఆ తర్వాత ‘ఘాతక్’ అని మార్చారు. 2009లో ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ అధ్యయనాన్ని ప్రారంభించారు. అందుకోసం రూ.12.5 కోట్లు ఖర్చు పెట్టారు.

2013లో అధ్యయనం పూర్తయింది. 2016 మేలో కేంద్ర ప్రభుత్వం దాని కోసం రూ.231 కోట్లను కేటాయించింది. 2017 నాటికి టెస్ట్ కోసం దాని పూర్తి స్థాయి మోడల్ ను అభివృద్ధి చేశారు. డ్రోన్ ను వేగంగా తయారు చేయడం కోసం ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్, ఐఐటీ కాన్పూర్ లు కలిసి స్టెల్త్ వింగ్ ఫ్లయింగ్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేశాయి.

ఘాతక్ డ్రోన్ గంటకు 190 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఘాతక్ పొడవు 4 మీటర్లు. దాని రెక్కల పొడవు 5 మీటర్లు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అధికారుల ఆదేశాలను అది రిసీవ్ చేసుకోగలదు. సముద్ర మట్టం నుంచి 6 కిలోమీటర్ల ఎత్తుకు అది చేరగలదు.

  • Loading...

More Telugu News