Telangana: పోలింగ్ సిబ్బందికీ డబ్బులిచ్చారు.. బస్సులో ఈవీఎంల మార్పులపై ఈటల మండిపాటు
- తనను ఓడించేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలూ చేశారని ఆరోపణ
- బస్సుల్లో ఈవీఎం మార్పుపై ఫిర్యాదు చేస్తామని కామెంట్
- అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆగ్రహం
హుజూరాబాద్ లో ఉప ఎన్నికల నిర్వహణ పట్ల బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. బస్సుల్లో కూడా ఈవీఎంలను మారుస్తున్నారన్న వార్తలు వస్తున్నాయని, అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలూ చేశారని, పోలింగ్ సిబ్బందికీ డబ్బులిచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. స్వయంగా ఎమ్మెల్యేలే డబ్బులు పంచి వెళ్లారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు.
అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఈటల ఆరోపించారు. బస్సుల్లో ఈవీఎంల మార్పుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పొరపాటు జరిగిందని కలెక్టర్ చెప్పడమేంటని ప్రశ్నించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యం ఎలా చూపిస్తారన్నారు. దీనిపై కలెక్టర్, సీపీల తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలిచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.