America: అమెరికాలోని న్యూజెర్సీలో దారుణం.. 80 కిలోమీటర్లు వెంబడించి భారత సంతతి వ్యాపారవేత్తను కాల్చి చంపిన దుండగుడు!

Indian Origin Man Killed By Gunman In New Jersey
  • న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో ఉంటున్న శ్రీరంగ అరవపల్లి
  • ఔరెక్స్ లేబరేటరీస్ పేరుతో ఫార్మా సంస్థ నిర్వహణ
  • క్యాసినో ఆడి ఇంటి వెళ్తుండగా వెంబడించిన దుండగుడు
  • ఇంటికి చేరుకున్న సమయంలో కాల్పులు జరిపి డబ్బుతో పరారీ
అమెరికాలోని న్యూజెర్సీలో ఓ దుండగుడు డబ్బు కోసం దారుణానికి పాల్పడ్డాడు. 80 కిలోమీటర్లు వెంబడించి మరీ భారత సంతతి వ్యాపారవేత్తను కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో ఉంటున్న శ్రీరంగ అరవపల్లి (54) ఔరెక్స్ లేబరేటరీస్ పేరుతో ఓ ఫార్మా సంస్థను నిర్వహిస్తున్నారు.

గత మంగళవారం అర్ధరాత్రి వరకు ఫిలడెల్ఫియాలోని ఓ క్లబ్‌లో క్యాసినో ఆడారు. అనంతరం 10 వేల డాలర్లతో ఇంటికి బయలుదేరారు. ఆయన వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉండడాన్ని గమనించిన ఓ దుండగుడు ఆ సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ వేశాడు. క్యాసినో నుంచి శ్రీరంగను వెంబడిస్తూ వెళ్లాడు. అలా దాదాపు 80 కిలోమీటర్లు వెంబడించాడు. శ్రీరంగ న్యూజెర్సీలోని ఇంటికి చేరుకుని లోపలికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపాడు. ఆయన వద్ద నుంచి సొమ్ము తీసుకుని పరారయ్యాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెన్సిల్వేనియాలోని నోరిస్‌టౌన్‌కు చెందిన నిందితుడు 27 ఏళ్ల జెకాయ్ రీడ్ జాన్‌‌ను అరెస్ట్ చేశారు. అరవపల్లి కుటుంబం అందరితో కలిసి మెలసి కలివిడిగా ఉండేదని, భార్యాపిల్లలతో కలిసి పండుగలు జరుపుకునేవారిని ఇరుగుపొరుగువారు గుర్తు చేసుకున్నారు. అరవపల్లికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు హైస్కూల్‌లో చదువుతున్నాడు.
America
New Jersey
Philadelphia
Casino

More Telugu News