Anasuya Bharadwaj: ఇదెక్కడి న్యాయమంటూ కేటీఆర్ ను ప్రశ్నించిన అనసూయ
- పిల్లలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత?
- స్కూళ్ల తీరును తప్పుబడుతూ ట్వీట్
- పిల్లలకు ఏం జరిగినా బాధ్యత కాదంటూ డిక్లరేషన్ తీసుకుంటున్నారని ఆవేదన
- తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
- మంత్రి సబితకూ ట్వీట్ ట్యాగ్
ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను యాంకర్, నటి అనసూయ నిలదీశారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలంగా మూతపడిన స్కూళ్లు.. ఇటీవలే తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని స్కూళ్లు మాత్రం పిల్లలకు ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదంటూ తల్లిదండ్రుల దగ్గర్నుంచి డిక్లరేషన్ ను తీసుకుంటున్నాయి. దీనిపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. ‘‘కేటీఆర్ సర్.. మొదట లాక్ డౌన్ పెట్టి ఆ తర్వాత అన్ లాక్ అన్నారు. వ్యాక్సిన్లు వేస్తూ భరోసా ఇస్తున్నారు. మరి వ్యాక్సిన్లు లేని చిన్నారుల పరిస్థితేంటి? పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులపై పాఠశాలలు ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? స్కూల్ లో ఉన్నప్పుడు పిల్లలకు ఏం జరిగినా తమది బాధ్యత కాదంటూ తల్లిదండ్రుల నుంచి ఎందుకు డిక్లరేషన్ తీసుకుంటున్నారు? ఇదేంటి సార్.. ఇదెక్కడి న్యాయం? మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం’’ అని అనసూయ ట్వీట్ చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికీ ఆమె ట్వీట్ ను ట్యాగ్ చేశారు.