Cricket: హార్దిక్ కు ముంబై అల్విదా.. వదిలేయాలని డిసైడ్ అయిన ప్రాంచైజీ!

Mumbai Indians To Say Good Bye To Hardik Pandya
  • వచ్చే ఐపీఎల్ కోసం డిసెంబర్ లో మెగా వేలం
  • ఫాంతో తంటాలు పడుతున్న ఆల్ రౌండర్
  • రోహిత్, బుమ్రా, పొలార్డ్ లనే అంటిపెట్టుకోవాలని ముంబై నిర్ణయం
  • స్కై లేదా ఇషాన్ లలో ఒకరికి చాన్స్
  • మరొకరిని వేలంలో ఎక్కువ పెట్టి తీసుకునేందుకూ రెడీ
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ అల్విదా చెప్పనుందా? తన వల్ల జట్టుకు ప్రయోజనం లేదని పక్కనపెట్టేద్దామని డిసైడ్ అయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాటిమాటికీ గాయాలపాలవుతుండడం.. ఆల్ రౌండర్ గా జట్టులోకి తీసుకున్నా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తుండడం.. అందులోనూ పేలవ ప్రదర్శనే నమోదు చేస్తుండడంతో అతడిని వదిలేసుకునేందుకు ముంబై ఇండియన్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ ఈ ఏడాది డిసెంబర్ లో ఫ్రెష్ గా ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈసారి  రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో కూడా బరిలోకి దిగుతున్నాయి. దాదాపు రూ.12 వేల కోట్లకు రెండు జట్లను వాటి యజమానులు సొంతం చేసుకున్నారు. వేలానికి అనుగుణంగా ప్రతి జట్టూ తన కోర్ టీంలోని నలుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకుని.. మిగతా ఆటగాళ్లను వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే హార్దిక్ ను రిలీజ్ చేసేందుకు ముంబై నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ అధికారి ఒకరు చెప్పారు. రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, కైరన్ పొలార్డ్ లను జట్టులోనే ఉంచుకోవాలని నిర్ణయించిందన్నారు. బ్యాటింగ్ లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ (స్కై), ఇషాన్ కిషన్ లలో ఒకరిని రిటెయిన్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

ప్రస్తుతం బ్యాటింగ్ లో హార్దిక్ పెద్దగా ఫాంలో కూడా లేడని, అప్పుడప్పుడు జట్టులోకి వస్తున్నా బౌలింగ్ చేయడం లేదని, ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ అతడిని రిలీజ్ చేసిందని చెబుతున్నారు. ఒకవేళ అతడిని తీసుకోవాలని అనుకున్నా వేలంలో తక్కువ ధర పలికితేనే అతడిని జట్టులోకి తిరిగి తీసుకునే చాన్స్ ఉందని తెలిపారు. స్కై లేదా ఇషాన్ లలో ఒకరిని రిలీజ్ చేసినా.. అతడిని వేలంలో ఎక్కువ పెట్టి తీసుకునేందుకైనా ముంబై ఇండియన్స్ సిద్ధమైనట్టు సమాచారం.
Cricket
Mumbai Indians
Hardik Pandya
IPL
Mega Auction
Rohit Sharma
Kieron Pollard
Jasprit Bumrah
Surya Kumar Yadav
Ishan Kishan

More Telugu News