Nara Lokesh: ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవుతున్నాయంటూ సీఎం జగన్ కు లోకేశ్ బహిరంగ లేఖ
- ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితిపై స్పందించిన లోకేశ్
- విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని వెల్లడి
- ఎయిడెడ్ విద్యాసంస్థలు మూసివేయొద్దని హితవు
- తొలగించిన అధ్యాపకులను తిరిగి తీసుకోవాలని సూచన
ఏపీలో ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ఎయిడెడ్ స్కూళ్ల మూసివేత కారణంగా లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవడమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మరణశాసనం కావడం చాలా విచారకరం అని పేర్కొన్నారు.
ఒక్క విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తే చాలు... అన్ని వ్యవస్థలు వాటికవే ధ్వంసం అవుతాయని సుప్రసిద్ధ తత్వవేత్త మాకియవెల్లిని ఉటంకిస్తూ లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యావ్యవస్థపై మీరు చేస్తున్న దాడి చూస్తుంటే అన్ని వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్నట్టే కనిపిస్తోందని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎయిడెడ్ విద్యాసంస్థలను యథావిధిగా కొనసాగించాలని, ఏ ఒక్క స్కూలు మూతపడకుండా చూడాలని లోకేశ్ డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్టు అధ్యాపకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.