Sachin Tendulkar: పాకిస్థాన్ పై ఇండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే: టెండూల్కర్

Tedulkar analysis on Indias defeat with Pakistan
  • షహీన్ బంతులను ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా క్రీజులో మన బ్యాట్స్ మెన్ కనిపించలేదు
  • ఆదిలోనే పాక్ వికెట్లు తీసి ఉంటే వారిపై ఒత్తిడి పెరిగేది
  • పాక్ జట్టును అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది
టీ20 ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 10 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్లేషణ చేశారు. మ్యాచ్ లో పాకిస్థాన్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిందని టెండూల్కర్ అన్నారు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై భారత్ దాదాపు 20 నుంచి 25 పరుగులు తక్కువ స్కోరు చేసిందని చెప్పారు.

షహీన్ ఆఫ్రిదీ విసిరిన అప్ ఫ్రంట్ బంతులను ఎదుర్కొనే సమయంలో రోహిత్  శర్మ, కేఎల్ రాహుల్ ఫుట్ వర్క్ సరిగా లేదని అన్నారు. షహీన్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుంటే వాటిని ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా మన బ్యాట్స్ మెన్ క్రీజులో కనిపించలేదని అన్నారు. పాక్ జట్టు వారి బౌలర్లను కచ్చితమైన ప్లాన్ తో సమర్థవంతంగా వినియోగించుకుందని చెప్పారు.

ఆదిలోనే టీమిండియా మూడు వికెట్లను కోల్పోయిందని... సూర్యకుమార్ యాదవ్ రెండు షాట్లు బాగానే ఆడినా ఎక్కువసేపు నిలవలేకపోయాడని సచిన్ అన్నారు. కోహ్లీ, పంత్ బాగానే ఆడినప్పటికీ ధాటిగా ఆడలేదని చెప్పారు. లక్ష్య ఛేదనలో కూడా భారత జట్టు ఆదిలోనే పాక్ వికెట్లను తీయలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ఆదిలోనే పాక్ వికెట్లు పడి ఉంటే ఆ జట్టు తీవ్ర ఒత్తిడికి గురయ్యేదని అన్నారు. కీలక సమయాల్లో పాక్ పై ఒత్తిడి తెచ్చే అవకాశాలు టీమిండియాకు వచ్చినప్పటికీ... మన వాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పారు. పాక్ తో క్రికెట్ ఆడి చాలా కాలమయిందని... అందుకే ఆ జట్టును అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.
Sachin Tendulkar
Team India
Pakistan
T20 World Cup

More Telugu News