Vijay Devarakonda: బాల్యం నుంచి సినీ హీరోలు అయ్యేదాకా... దేవరకొండ బ్రదర్స్ లైఫ్ లో ఆసక్తికర అంశాలు.. ఇవిగో!
- 'పుష్పక విమానం' చిత్రంలో నటించిన ఆనంద్ దేవరకొండ
- ప్రమోషన్స్ లో భాగంగా దేవరకొండ బ్రదర్స్ ఇంటర్వ్యూ
- తమ్ముడ్ని బాగా గారాబం చేసేవారన్న విజయ్
- హాస్టల్లో విజయ్ దూకుడుగా ఉండేవాడని ఆనంద్ వెల్లడి
చిత్రసీమలో అనతికాలంలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ... అన్న బాటలోనే సినీ రంగప్రవేశం చేసి ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఆనంద్ దేవరకొండ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం' చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఈ ముఖాముఖిలో దేవరకొండ సోదరులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. బాల్యం నుంచి సినిమా హీరోలు అయ్యేంతవరకు తమ జీవితంలోని పలు అంశాలను వివరించారు.
చిన్నప్పటి నుంచి తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను తల్లిదండ్రులు బాగా గారాబం చేసేవారని, తనను మాత్రం మూడో తరగతికే పెద్దవాడ్ని చేసేశారని విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఇంట్లో ఆటబొమ్మలు అన్నీ తమ్ముడికే ఇచ్చేవారని, క్రికెట్ లో కూడా ఆనంద్ అవుటైనా నాటౌట్ అని చెప్పేవారని, దాంతో తనకు తీవ్రంగా కోపం వచ్చేదని తెలిపారు.
తామిద్దరం చిన్నప్పటి నుంచి ఎక్కువగా హాస్టల్లోనే పెరిగామని, ఆనంద్ సైలెంట్ గా ఉండేవాడని, ఇంటికొస్తే మాత్రం తనకు చుక్కలు చూపించేవాడని పేర్కొన్నారు. ఆనంద్ మాట్లాడుతూ, హాస్టల్లో తనను ఎవరైనా ఏదైనా అంటే విజయ్ ఊరుకునేవాడు కాదని వెల్లడించారు. తమ రౌడీయిజం చూసి హెడ్ మాస్టర్ హడలిపోయేవారని విజయ్ తెలిపారు.
దేవరకొండ బ్రదర్స్ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
విజయ్, ఆనంద్ ల తల్లిదండ్రులు ఓ దశలో ఇక స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ నడిపేవారు. దాంట్లో మోటివేషన్ క్లాసులు, స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు చెప్పేవారు. ఒక్కోసారి ఎవరైనా ఫ్యాకల్టీ రాకపోతే విజయ్ దేవరకొండ వెళ్లి క్లాసులు చెప్పేవాడు. ఆ విధంగా క్లాసులు చెప్పినందుకు కొంత పారితోషికం కూడా ముట్టేది.
ఇక సినిమాల్లోనే తన కెరీర్ వెదుక్కోవాలని విజయ్ నిర్ణయించుకున్న సమయంలో వారి కుటుంబానికి ఆనంద్ ఆసరాగా నిలిచాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం అమెజాన్ సంస్థలో ఇంటర్న్ షిప్ పూర్తి చేశాడు. ఆపై అమెరికాలో డెలాయిట్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు.
ఆనంద్ ఉద్యోగంలో చేరిన తర్వాత వారి కుటుంబం కాస్త ఆర్థికంగా నిలదొక్కుకుంది. తండ్రి బర్త్ డేకి ఆనంద్ టెలివిజన్ కొనగా... వారి కుటుంబానికి తొలి కారును, సొంత ఇళ్లను విజయ్ కొనుగోలు చేశాడు.