Prabhakar Sail: అనూహ్యరీతిలో మలుపు తిరిగిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు... అడ్డం తిరిగిన సాక్షి
- ముంబయిలో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం
- దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ
- సాక్షులుగా 9 మంది
- వారిలో ప్రభాకర్ సెయిల్ ఒకరు
- ఎన్సీబీపైనే ఆరోపణలు చేసిన సెయిల్
సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపడుతున్న ఎన్సీబీ... ఈ కేసులో 9 మందిని సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రభాకర్ సెయిల్ ఒకరు. ఈ కేసులో మరో సాక్షిగా ఉన్న ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవికి ప్రభాకర్ సెయిల్ బాడీగార్డు. ఈ కేసులో తనను సాక్షిగా పేర్కొన్నప్పటి నుంచి గోసవి పరారీలో ఉన్నాడు.
అయితే, ప్రభాకర్ సెయిల్ అనూహ్యరీతిలో సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో గోసవి-ఎన్సీబీ మధ్య ఒప్పందం కుదిరిందని, భారీగా లంచాల వ్యవహారం నడుస్తోందని తెలిపాడు. ఈ మేరకు కోర్టుకు అఫిడవిట్ సమర్పించాడు. తనతో ఎన్సీబీ అధికారులు ఖాళీ పంచనామా పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని వివరించాడు.
ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేతో తనకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ముంబయి సమీపంలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైనప్పటి నుంచి అనేక కీలక పరిణామాలు జరిగాయని, వాటిన్నింటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ప్రభాకర్ సెయిల్ తన అఫిడవిట్ లో పేర్కొన్నాడు. అయితే, ప్రభాకర్ సెయిల్ తనపైనే ఆరోపణలు చేయడంతో ఎన్సీబీ స్పందించింది. అతడి ఆరోపణనలను తోసిపుచ్చింది.
కాగా, ప్రభాకర్ సెయిల్ ఆరోపణలకు బలం చేకూర్చుతూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా అదే తరహా ఆరోపణలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల నుంచి ఎన్సీబీ డబ్బులు డిమాండ్ చేస్తోందని, దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని తెలిపారు. అంతేకాకుండా తెల్ల కాగితాలపై సాక్షులతో సంతకాలు చేయించుకుంటోందని ఆరోపించారు.