Assam: అశ్లీల చిత్రాలు చూసేందుకు నిరాకరించిన ఆరేళ్ల బాలిక.. రాళ్లతో కొట్టి చంపిన బాలురు!

boys killed girl as she denied to watch blue films

  • అస్సాంలోని నగావ్ జిల్లాలో దారుణం
  • తండ్రి ఫోన్‌లోని నీలి చిత్రాలను చూసేందుకు అలవాటు పడిన బాలుడు
  • బాలికను క్వారీ వద్దకు పిలిచి నీలి చిత్రాలు చూపించిన వైనం
  • చూసేందుకు నిరాకరించడంతో అమానుషంగా హత్య
  • పడిపోతున్న నైతిక విలువలకు బాధ్యత మనదేనన్న నగావ్ ఎస్పీ

తమతో కలిసి సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేందుకు నిరాకరించిందన్న కోపంతో ముగ్గురు బాలలు ఆరేళ్ల బాలికను రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. అస్సాంలోని నగావ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. కలియబర్ పట్టణ పరిధిలోని మిస్సా గ్రామానికి చెందిన 11 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు బాలలు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. అశ్లీల చిత్రాలు చూసేందుకు అలవాటు పడిన వీరు మంగళవారం మధ్యాహ్నం బాధిత బాలికను గ్రామంలోని క్వారీ వద్దకు రమ్మని పిలిచారు.

తమతోపాటు తెచ్చిన సెల్‌ఫోన్‌లోని నీలి చిత్రాలను చూడాలని బాలికను ఒత్తిడి చేశారు. అందుకు చిన్నారి నిరాకరించడంతో కోపంతో పక్కనే ఉన్న రాళ్లతో ఆమెను కొట్టి చంపేశారు. నిందితులైన బాలల్లో ఒకరు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అతడి తండ్రి తన స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు. అందులో అప్పటికే అతడు డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్న లెక్కలేనన్ని నీలి చిత్రాలు ఉన్నాయి. మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి బాలుడు వాటిని చూడడాన్ని అలవాటు చేసుకున్నాడు.

ఈ క్రమంలో బాలికను పిలిచారు. ఆమె వాటిని చూసేందుకు నిరాకరించడంతో హత్య చేశారు. 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. క్వారీలోని మరుగుదొడ్డి వద్ద బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. నేరాన్ని దాచేందుకు యత్నించిన నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి ఎస్పీ ఆనంద్ మిశ్రా మాట్లాడుతూ.. సమాజంలో నైతిక విలువలు పడిపోతే దానికి బాధ్యత మనమే వహించాల్సి ఉంటుందని, ఈ ఘటన అందుకు నిదర్శమని అన్నారు.

  • Loading...

More Telugu News