Siddaramaiah: ఆరెస్సెస్ ఈ దేశానికి ప్రమాదకరం.. ఎందుకంటే..!: సిద్ధరామయ్య
- అసహజమైన వాతావరణాన్ని సృష్టించి లబ్ధి పొందాలనే భావన ఆరెస్సెస్ ది
- నిత్యావసరాల ధరలను ప్రతిరోజూ బీజేపీ సర్కార్ పెంచుతోంది
- ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తూనే ఉంటాం
ఆరెస్సెస్ పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. తనకు ఆరెస్సెస్ అంటే భయమని... సమాజంలో అసహజమైన వాతావరణాన్ని సృష్టించి, దాన్నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనే భావన ఆరెస్సెస్ ది అని చెప్పారు. ఆరెస్సెస్ చేసే పనులు ప్రజలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఆరెస్సెస్ దేశానికి ప్రమాదకరమని చెప్పారు.
బీజేపీ పాలనలో సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, డబ్బు కోసం కాంగ్రెస్ ఎలాంటి మోసాలకైనా పాల్పడుతుందని బీజేపీ తమను విమర్శిస్తోందని... అధికారం శాశ్వతం కాదనే విషయం తమకు తెలుసని అన్నారు. అధికారంలోకి రావడానికి బీజేపీ చేసిన తప్పుడు పనులను... తమకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల నిత్యావసరాల ధరలను బీజేపీ సర్కారు ప్రతి రోజు పెంచుకుంటూ పోతోందని... దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తూనే ఉంటామని... తమకు ప్రజలు కూడా అండగా నిలిస్తే పోరాటం శక్తిమంతంగా తయారవుతుందని అన్నారు.