Bangladesh: టీ20 ప్రపంచకప్: ఒమన్‌పై గెలిచి ఖాతా తెరిచిన బంగ్లాదేశ్
- తొలి మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్‌పై ఓటమి
- ఆల్‌రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న షకీబల్ హసన్
- బ్యాటింగ్‌లో విఫలమైన ఒమన్ ఆటగాళ్లు
తొలి మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలైన బంగ్లాదేశ్ గత రాత్రి ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో విజయం సాధించి ఖాతా తెరిచింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-బిలో నిన్న ఈ రెండు జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 153 పరుగులకు ఆలౌట్ అయింది.
టీ20 వరల్డ్ కప్ లో ఒమన్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ నయీం 50 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేయగా, ఆల్ రౌండర్ షకీబల్ హసన్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. కెప్టెన్ మహ్మదుల్లా 17 పరుగులు చేశాడు. మిగతా వారెవరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 3, ఫయాజ్ బట్ 3, కలీముల్లా 2, జీషన్ మక్సూద్ 1 వికెట్ తీశారు.
అనంతరం 154 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఒమన్ జట్టులో జతీందర్ సింగ్ (40), కశ్యప్ ప్రజాపతి (21), కెప్టెన్ జీషన్ మక్సూద్ (12), మహమ్మద్ నదీమ్ (14) తప్ప మిగతా వారెవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ 4 వికెట్లు తీసుకోగా, షకీబల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. సఫియుద్దీన్, హసన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచిన షకీబల్ హసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.