Patimeedigudem: దెయ్యం భయంతో గ్రామం ఖాళీ... గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
- పాటిమీదిగూడెం గ్రామంలో దెయ్యం భయం
- కొన్నిరోజుల వ్యవధిలో 8 మంది మరణం
- దెయ్యం తిరుగుతోందని చెప్పిన భూతవైద్యుడు
- ఒకరోజు పాటు ఊరు ఖాళీ చేయాలని సూచన
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెంలో కొన్నిరోజులుగా దెయ్యం భయం నెలకొంది. కొంతకాలంగా ఊర్లో పలు కారణాలతో 8 మంది మరణించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇంతమంది చనిపోవడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే అదనుగా ఓ భూతవైద్యుడు రంగప్రవేశం చేసి గ్రామంలో దెయ్యం తిరుగుతోందని, ఒకరోజంతా ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పాడు. దాంతో ప్రజలు ఒకరోజు పాటు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెవినపడడంతో ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే పాటిమీదిగూడెం గ్రామంలో స్వయంగా పర్యటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ, ఇక్కడ గుడుంబానే అసలు దెయ్యం అని స్పష్టం చేశారు. గుడుంబా తాగడం మానేస్తే అన్ని పరిస్థితులు చక్కబడతాయని హితవు పలికారు.