Koppula Eshwar: రాజకీయ ఒత్తిడితోనే దళితబంధును ఈసీ ఆపేసింది: మంత్రి కొప్పుల ఈశ్వర్
- దళితబంధును నిలిపివేయడంలో రాజకీయ కుట్ర ఉంది
- పథకాన్ని ఆపాలని ఈసీకి బీజేపీ నేతలు లేఖ ఎందుకు రాశారు?
- దీనికి ఈటల రాజేందర్ బాధ్యత వహించాలి
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిబంధు పథకానికి ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందిస్తూ.. దళితబంధు పథకాన్ని నిలిపివేయడంలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ పథకాన్ని నిలిపివేయడం దళితజాతికి జరిగిన అన్యాయంగా భావించాలని చెప్పారు.
దళితబంధు పథకాన్ని ఆపాలని బీజేపీ నేతలు ఈసీకి ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. ఈ పథకాన్ని హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం తీసుకురాలేదని చెప్పారు. దళితబంధు పథకాన్ని ఈసీ ఆపివేయడానికి ఈటల రాజేందర్ బాధ్యత వహించాలని అన్నారు. కొనసాగుతున్న పథకాన్ని ఆపివేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. రాజకీయ ఒత్తిడితోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు.