Mohan Babu: సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోయాయి: మోహన్ బాబు వ్యాఖ్యలు
- నేను ఏం చేశానో ప్రకృతికి తెలుసు.. ఆ దేవుడికి తెలుసు
- భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాడు
- 'మా' అనేది రాజకీయ వేదిక కాదు.. కళాకారుల వేదిక
- కళామతల్లి బిడ్డల్లో ఐక్యం లోపించింది
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచు మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
'చిత్రపురి కాలనీని హెరిటేజ్ సైట్ కింద మార్చేసి, చుట్టూ ఉన్న కొండలను ఏదో చేద్దామని ఓ సమయంలో ఓ ముఖ్యమంత్రి ప్లాన్ చేశారు. తమ్ముడు శ్రీనివాస్ యాదవ్‌కు కూడా తెలుసు. నేను అప్పుడు రాజ్యసభ సభ్యుడిని. అప్పట్లో నేను గవర్నర్ వద్దకు వెళ్లి వినతి పత్రం సమర్పించా' అని మోహన్ బాబు చెప్పారు.
'కళాకారులకు అన్యాయం జరగకూడదని చెప్పాను. నేను ఏం చేశానో ప్రకృతికి తెలుసు. ఆ దేవుడికి తెలుసు. ఆ భగవంతుడు ఉన్నాడు. మమ్మల్ని ఆశీర్వదించాడు. కలిసి మెలసి ఉంటూ కావల్సినవి సాధించుకుందాం. మా అనేది రాజకీయ వేదిక కాదు.. కళాకారుల వేదిక. సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోయాయి. సినీ పరిశ్రమలో గెలుపు, ఓటుములు సహజం. మాలో మేమంతా ఒకే తల్లి బిడ్డలం' అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
'అయితే, కళామతల్లి బిడ్డల్లో ఐక్యం లోపించింది. మా ఎన్నికల్లో నా బిడ్డ విష్ణుకు నరేశ్ సాయం చేశారు. అది మామూలు సాయం కాదు. చాలా కృషి చేశారు. విష్ణుకి ఎన్నో సలహాలు ఇచ్చారు. నరేశ్ నా స్నేహితుడు కాదు. కానీ, ఆయన తల్లిగారు విజయనిర్మల గారు తీసిన సినిమాల్లో చేశాను. నరేశ్ తో మాత్రం ఎన్నడూ సన్నిహితంగా లేను. అయినప్పటికీ ఆయన వచ్చి నా బిడ్డకు సాయం చేశారు' అని మోహన్ బాబు చెప్పారు.