Javed Miandad: ఈ విధంగా ఆడితేనే ఇండియాపై గెలుస్తాం: పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్
- ఒత్తిడి, భయం లేకుండా ఆడితేనే విజయం దక్కుతుంది
- టీ20 అంటే కేవలం సిక్సులు, ఫోర్లు బాదడం కాదు
- జట్టు మొత్తం బాబర్ పై ఆధారపడకూడదు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కు సమయం ఆసన్నమవుతోంది. కరోనా మహమ్మారి పంజా విసిరిన తర్వాత జరుగుతున్న అతి పెద్ద క్రికెట్ టోర్నీ ఇది కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైటిల్ ను గెలిచేందుకు అగ్రశ్రేణి జట్లన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా కొనసాగబోతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు భారత్ తో జరిగే మ్యాచ్ లపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన జావెద్ మియాందాద్ స్పందించారు. టీమిండియాతో జరిగే మ్యాచ్ చాలా కీలకమని... ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా ఆడితేనే విజయాన్ని సాధించగలమని పాక్ ఆటగాళ్లకు సూచించారు. టీ20 అంటే కేవలం సిక్సులు, ఫోర్లను బాదడమే కాదని... పక్కా ప్రణాళిక, సమయోచిత నిర్ణయాలు కూడా అవసరమని చెప్పారు. జట్టు మొత్తం బాబర్ పై ఆధారపడకూడదని... ప్రతి ఒక్క ఆటగాడు తమ వంతు పాత్రను పోషించాలని అన్నారు.