Prakash Raj: మోహన్ బాబు, నరేశ్ లపై ఆరోపణలు గుప్పిస్తూ... 'మా' ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఘాటు లేఖ
- ఎన్నికల సందర్భంగా దురదృష్టకర ఘటనలు చూశాం
- కొందరిపై భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు
- సీసీ కెమెరాల ఫుటేజీ మాకు ఇవ్వండి
టాలీవుడ్ లో 'మా' ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఎన్నికల సమయంలో అనేక అరాచకాలు జరగాయంటూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది. మరోవైపు, 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఘాటు లేఖ రాశారు. ఎన్నికల పూర్తి సారాంశం ఇదే...
'ఎన్నికల అధికారి కృష్ణమోహన్ గారికి... ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల సందర్భంగా ఎన్నో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకోవడం మీరు గమనించారు. మోహన్ బాబు, నరేశ్ అన్యాయమైన, సంఘ వ్యతిరేక ప్రవర్తనను మనందరం చూశాం. 'మా' సభ్యులను వారు దూషించడం, బెదిరించడం చేశారు. భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో వారు వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు మీరు మీ విచక్షణాధికారాలను ఉపయోగించారని నేను అనుకుంటున్నా. కొన్ని విజువల్స్ మీడియాకు లీక్ అయ్యాయి. ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన సంఘటనలు జనాలు నవ్వుకునేలా చేస్తున్నాయి. కొందరి తీరు అసహ్యాన్ని కలిగించేలా ఉంది.
పోలింగ్ సమయంలో సీసీ కెమెరాల వినియోగం గురించి మీరు మాట్లాడారు. ఆ కెమెరాలు ప్రతి ఒక్క ఘటనను రికార్డ్ చేశాయని నేను నమ్ముతున్నాను. సీసీ కెమెరాల ఫుటేజీని మాకు ఇవ్వాలని కోరుతున్నా. ఎన్నికలకు సంబంధించి అవసరమైన పూర్తి సమాచారాన్ని పొందే ప్రజాస్వామ్య హక్కు మాకు ఉంది. పోలింగ్ అధికారిగా అన్ని రికార్డులను కనీసం మూడు నెలల పాటు భద్రపరచాల్సిన బాధ్యత మీపై ఉంది' అని లేఖలో ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు.