Tamil Nadu: హిందూ దేవాలయాల బంగారాన్ని కరిగించడం కొత్తేమీ కాదు: తమిళనాడు ప్రభుత్వం
- 1977 నుంచే ఆలయాల ఆభరణాలను కరిగించే ప్రక్రియ కొనసాగుతోంది
- ఆభరణాలను కడ్డీలుగా మార్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నాం
- ఇప్పుడు 2,137 కేజీల ఆభరణాలను కరిగించాలని నిర్ణయించాం
రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు చెందిన బంగారు ఆభరణాలను కరిగించడం కొత్త విషయమేమీ కాదని, అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రక్రియ అని మద్రాస్ హైకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. 1977 నుంచే దేవాలయాలకు చెందిన బంగారు ఆభరణాలను కరిగించే విధానం అమలవుతోందని వివరించింది.
దీని గురించి అవగాహన లేకుండా కొందరు రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు 5 లక్షల గ్రాముల ఆభరణాలను కరిగించి, కడ్డీల రూపంలోకి మార్చి, బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని తెలిపింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 11 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 2,137 కేజీల బంగారాన్ని ముంబైలోని ప్రభుత్వ మింట్ లో కరిగించాలని, కడ్డీలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించామని చెప్పింది.
దేవాలయాల బంగారు ఆభరణాలను కరిగించాలని సెప్టెంబర్ 9, 22 తేదీల్లో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 21కి వాయిదా వేసింది.