Telangana: తెలంగాణ నుంచి వెనుదిరుగుతున్న నైరుతి రుతుపవనాలు
- జూన్ 5నే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
- నిన్నటికి మహారాష్ట్ర నుంచి హనుమకొండ వరకు వెనక్కి
- నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం
ఈసారి నిర్దేశిత సమయం కంటే ముందే తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. రాష్ట్రం నుంచి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న మహారాష్ట్ర సరిహద్దు నుంచి హనుమకొండ వరకు వెనక్కి మళ్లినట్టు ఆ శాఖ డైరెక్టరర్ నాగరత్న తెలిపారు.
ఇక నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు ఉత్తరప్రాంతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉందని, దీని ప్రభావంతో రేపు అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందన్నారు. ఆ తర్వాత అది బలపడి శుక్రవారం ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, ఈసారి జూన్ 5నే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.