Chandrababu: డ్రగ్స్‌పై నిరాధార ఆరోపణలు, కథనాలు.. చంద్రబాబు, లోకేశ్, ఆంధ్రజ్యోతి, ఈనాడుకు ఏపీ డీజీపీ లీగల్ నోటీసులు

ap dgp gautam sawang sent legal notices to chandrababu lokesh andhrajyothy and eenadu

  • ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా  ఆరోపణలు చేశారని నోటీసులు
  • వాస్తవాలను నిర్ధారించుకోకుండా కథనాలు ప్రచురించారన్న డీజీపీ
  • బేషరతు క్షమాపణ చెప్పకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌కు ఏపీతో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభితోపాటు ఈ వ్యవహారంపై కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు, రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఈనాడు బ్యూరో చీఫ్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, అమోద పబ్లికేషన్స్, ప్రింటర్, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆ పత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్, బ్యూరో చీఫ్‌లకు  ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ లీగల్ నోటీసులు పంపారు.  

గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని విజయవాడ పోలీసు కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చేలా, పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారని ఆ నోటీసుల్లో డీజీపీ పేర్కొన్నారు. పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని డీఆర్ఐ స్వయంగా ప్రకటించిందని గుర్తు చేశారు.

అలాగే, వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వార్తలు ప్రచురించాయని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేసినందుకు గాను నోటీసులు అందుకున్న వారందరూ బేషరతు క్షమాపణలు చెప్పాలని, ఆ వార్తను అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News