Manchu Vishnu: అంకుల్... మీ నిర్ణయం నాకు నచ్చలేదు: ప్రకాశ్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు స్పందన
- 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమి
- 'మా' నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు
- 'మా' సభ్యత్వానికి ప్రకాశ్ రాజీనామా
- తన రాజీనామా ఆమోదించాలని విష్ణుకు సందేశం
'మా' అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించడం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు టెలిగ్రామ్ యాప్ ద్వారా తెలియజేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమోదించాలని కోరారు. 'మా' ఎన్నికల్లో అద్భుత విజయం సాధించావంటూ మంచు విష్ణును అభినందించారు. 'మా'ను నడిపించేందుకు సకల శక్తులు ప్రాప్తించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 'మా'లో సభ్యుడ్ని కాకపోయినా తన అవసరం ఉందనుకుంటే తప్పకుండా మద్దతు ఇస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
దీనిపై మంచు విష్ణు బదులిచ్చారు. తనకు అభినందనలు తెలిపిన ప్రకాశ్ రాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయడం తనకు అసంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు."మీరు నాకుంటే ఎంతో పెద్దవారు. ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులా గెలుపోటములు ఉంటాయని మీకు తెలుసు. దీన్ని మనం ఒకేలా స్వీకరిద్దాం.
దయచేసి మీరు భావోద్వేగాలకు లోను కాకండి. మీరు మా కుటుంబంలో ఒక ముఖ్య భాగం. మీ ఆలోచనలు మాకు కావాలి, మనం కలిసి పనిచేయాల్సి ఉంది. మీరు ఇప్పుడు వెంటనే నాకు బదులు ఇవ్వొద్దని కోరుతున్నాను. త్వరలో నేనే మిమ్మల్ని కలుస్తాను... అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఐ లవ్యూ అంకుల్... దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు! మనం ఎప్పటికీ ఒక్కటే!" అంటూ మంచు విష్ణు స్పందించారు.