SRH: బ్యాట్‌తో విధ్వంసం సృష్టించినా ముంబైకి నిరాశే.. మరో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించిన బెంగళూరు
- ముంబై బ్యాట్స్‌మెన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఊచకోత
- 235 పరుగుల భారీ స్కోరు.. దీటుగా బదులిచ్చి ఓడిన హైదరాబాద్
- చివరి బంతికి సిక్సర్ కొట్టి బెంగళూరుకు విజయాన్ని అందించిన శ్రీకర్ భరత్
ఐపీఎల్‌లో ఈసారి ముంబైకి కలిసిరాలేదు. ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే కథ ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో 170కిపైగా పరుగుల తేడాతో విజయం సాధిస్తే ఫ్లే ఆఫ్స్‌లోకి వెళ్లే అవకాశం ఉండడంతో బ్యాట్‌తో విరుచుకుపడింది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత సేపు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ఇషాన్ ముంబై తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న ఇషాన్ మొత్తంగా 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు.
మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. వీరిద్దరి దెబ్బకు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీసుకున్నాడు.
అనంతరం 236 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ధాటిగానే ఆడింది. గత మ్యాచుల్లో ఎప్పుడూ కనిపించనంత జోరు కనబర్చింది. లక్ష్యాన్ని ఛేదించాలన్న కసి హైదరాబాద్ బ్యాటర్లలో కనిపించింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేసి విజయానికి 43 పరుగుల ముందు ఆగిపోయింది.
జేసన్ రాయ్ 34, అభిషేక్ శర్మ 33, కెప్టెన్ మనీష్ పాండే 69, ప్రియం గార్గ్ 29 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, కౌల్టర్ నైల్, నీషమ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, బౌల్డ్, పీయూష్ చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాట్‌తో విరుచుకుపడిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముంబై ఇంటి బాట పట్టడంతో కోల్‌కతాకు ప్లే ఆఫ్స్‌లో బెర్త్ ఖరారైంది.
ఇదిలావుంచితే... ఢిల్లీ కేపిటల్స్-రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో కోహ్లీ సేన చివరి బంతికి సిక్సర్ కొట్టి అనూహ్య విజయం సాధించింది. ఓడిన ఢిల్లీ, గెలిచిన ఆర్సీబీ స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఢిల్లీ 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరు 18 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పృథ్వీషా 48, ధావన్ 43, పంత్ 10, శ్రేయాస్ అయ్యర్ 18, హెట్‌మెయిర్ 29 పరుగులు చేశారు. అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
అయితే, మ్యాచ్ చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియక ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరం. అవేశ్ ఖాన్ తొలి ఐదు బంతుల్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఇక బెంగళూరు ఓటమి ఖాయమని అనుకున్నారు.
అయితే, అప్పుడే అద్భుతం జరిగింది. చివరి బంతిని వైడ్‌గా వేయడం బెంగళూరుకు కలిసొచ్చింది. ఆ తర్వాతి బంతిని శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టడంతో బెంగళూరు జట్టు సంబరాల్లో మునిగిపోయింది. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసిన భరత్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. డివిలియర్స్ 26, మ్యాక్స్‌వెల్ 51 పరుగులు చేశారు. ఇక ప్లే ఆఫ్స్‌లో బెంగళూరు జట్టు కోల్‌కతా తలపడనుండగా, టాప్-2 జట్లు అయిన ఢిల్లీ, చెన్నై తలపడతాయి.