Varla Ramaiah: మద్యపాన నిషేధానికి లక్ష్మణరెడ్డి చేసిన కృషి ఏమిటి?: వర్ల రామయ్య
- మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
- కమిటీ పనితీరుపై వర్ల రామయ్య విమర్శలు
- కమిటీ ఏంచేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్
- సీఎం జగన్ దోచిపెడుతున్నారని వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి పదవీకాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగించడం పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. సీఎం జగన్ ఓవైపు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ, మరోవైపు మద్య విమోచన కమిటీ పేరుతో తన సామాజిక వర్గం వారికి ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు.
మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ గా లక్ష్మణరెడ్డి పదవీకాలాన్ని ఏపీ ప్రభుత్వం పొడిగించేవరకు, రాష్ట్రంలో మద్య విమోచన ప్రచార కమిటీ ఒకటి ఉందన్న విషయం కూడా ప్రజలకు తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి లక్ష్మణరెడ్డి చేసిన కృషి ఏమిటి? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ రెండున్నరేళ్లలో కమిటీ ఏంచేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.