Uttar Pradesh: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు డ్రైవ్ చేశాడు: గాయపడ్డ రైతు
- ఉత్తరప్రదేశ్ లో రైతులపై నుంచి దూసుకుపోయిన కారు
- మమ్మల్ని చంపేందుకు కుట్ర ప్రకారం ఇది జరిగిందన్న రైతు
- వెనుక నుంచి తమను వేగంగా ఢీ కొట్టారని ఆరోపణ
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై నుంచి కారు దూసుకుపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు తేజీందర్ విర్క్ మాట్లాడుతూ, రైతులపై నుంచి దూసుకుపోయిన కారులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో పాటు ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడని తెలిపారు. దారుణ ఘటన జరిగి 72 గంటలు గడుస్తున్నా అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.
నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన మమ్మల్ని చంపేందుకు ఒక కుట్ర ప్రకారమే ఇది జరిగిందని తేజీందర్ అన్నారు. యూపీలోకి రైతుల నిరసనలను తాను అనుమతించబోనని, లఖింపూర్ ను వదిలేయండని అజయ్ మిశ్రా అన్నారని... ఈ వ్యాఖ్యలకు నిరసనగా తాము ఆందోళన చేస్తున్నామని చెప్పారు. తాము రోడ్డు పక్కన నల్ల జెండాలు పట్టుకుని నిల్చున్నామని తెలిపారు.
వారు మరో మార్గంలో వెళ్తున్నారనే విషయం మాకు మధ్యాహ్నం 3 గంటలకు తెలిసిందని... దీంతో, అక్కడి నుంచి అహింసాయుతంగా తాము వెనక్కి వెళ్తుంటే... వేగంగా దూసుకొచ్చిన కార్లు తమను వెనుక నుంచి ఢీకొన్నాయని చెప్పారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తమపై నుంచి కార్లను పోనిచ్చారని అన్నారు. అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు, వారి మనుషులు కారులో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయానని తెలిపారు. కేంద్ర మంత్రిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.