Huzurabad: హుజూరాబాద్ లో అణువణువూ జల్లెడ.. భారీగా బలగాల మోహరింపు.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్!
- శాంతిభద్రతల డీసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు
- నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు
- బస్సులు, ప్రైవేట్ వాహనాల తనిఖీ
- ఎక్కువ డబ్బుంటే పేపర్లు వెంటబెట్టుకోవాలని సూచన
హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఈటల రాజేందర్ ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నెల 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, నామినేషన్లు మొదలైన అదే రోజు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. ఈటల రాజేందర్ 8న నామినేషన్ వేస్తారని సమాచారం. ఎవరూ ఊహించని విధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ బరిలో నిలిపింది. అయితే, ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే అన్నది స్పష్టం.
ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున హుజూరాబాద్ లో భారీగా పోలీసులు, బలగాలను మోహరించారు. శాంతిభద్రతల విభాగం డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఏ ఒక్కరినీ వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. అణువణువూ జల్లెడ పడుతున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలతో పట్టణమంతా నిఘా పెట్టారు. హుజూరాబాద్ టౌన్ లోని జమ్మికుంట రోడ్డు, కరీంనగర్–వరంగల్ హైవేపై ప్రైవేట్ వాహనాలు, బస్సుల్లో తనిఖీలు చేశారు.
కార్లలో ఉన్న వారిని బయటకు దించేసి మరీ లోపలంతా క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సుల్లోని వారినీ సోదా చేశారు. డబ్బులు ఎక్కువగా తీసుకెళ్లేవారంతా దానికి సంబంధించిన సరైన పత్రాలను వెంటబెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కాగా, ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 2న ఫలితాలు వెల్లడవుతాయి.