CM Jagan: ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండాలి: సీఎం జగన్
- రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం సమీక్ష
- హాజరైన హోంమంత్రి, ఉన్నతాధికారులు
- సీఎంకు వివరాలు తెలిపిన అధికారులు
- దిశానిర్దేశం చేసిన సీఎం
ఏపీలో శాంతిభద్రతలపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ప్రతి మహిళ ఫోన్ లో దిశ యాప్ తప్పనిసరిగా ఉండాలని, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ రహితంగా ఉండేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
అధికారులు స్పందిస్తూ... రాష్ట్రంలో ఇప్పటిదాకా 74,13,562 మంది దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, వారిలో 5,238 మందికి యాప్ ద్వారా సాయం అందిందని సీఎంకు వివరించారు. ఏపీలో 'దిశ' అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, పోలీసు విభాగం బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం వంటి అంశాలపై సీఎం జగన్ కూలంకషంగా చర్చించారు.