Mohan Babu: 'మా' ఎన్నికలపై స్పందించిన మోహన్ బాబు

Mohan Babu explains MAA Elections

  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మోహన్ బాబు వ్యాఖ్యలు
  • భ్రష్టు రాజకీయాలని వెల్లడి
  • క్యారెక్టర్స్ లేని వాళ్లు కూడా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • చిరంజీవి తనకు ఎప్పటికీ స్నేహితుడేనని స్పష్టీకరణ

అగ్రశ్రేణి నటుడు మోహన్ బాబు మా ఎన్నికలపై స్పందించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు... ఆర్కే అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. నీచ, నికృష్ణ, దరిద్రగొట్టు, భ్రష్టు రాజకీయాలు మా ఎన్నికల సందర్భంగా నెలకొన్నాయని వివరించారు. తెలిసినవాడు, తెలియనివాడు, వెధవలు, క్యారెక్టర్స్ లేనివాళ్లు కొంతమంది అదేదో కిరీటం అనుకుని, అద్భుతం అనుకుని ఏవేవో మాట్లాడుతున్నారు అని విమర్శించారు.

వాస్తవానికి మంచు విష్ణును మా ఎన్నికల్లో పోటీ చేయించాలని తాము అనుకోలేదని వివరించారు. కొన్ని కారణాల వల్ల మంచు విష్ణు చివరికి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉందని, ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే గజరాజు వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయని, ప్రతివాటికి బదులివ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

చిరంజీవి ఎప్పటికీ స్నేహితుడే!

చిరంజీవితో తన స్నేహం చెక్కుచెదరదని, ఇవాళ, రేపు, ఎప్పటికీ చిరంజీవి తనకు స్నేహితుడని స్పష్టం చేశారు. చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా మా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, వారు తనతో ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదన చేస్తే తాను విష్ణుతో ఉపసంహరింపజేసేవాడ్నని అన్నారు. చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ పిల్లలను తన పిల్లలుగానే భావిస్తానని వెల్లడించారు. మా ఎన్నికల్లో ఇన్ని పరిణామాలు జరగకపోయుంటే తన కొడుకును చిరంజీవి వద్దకు తీసుకెళ్లేవాడ్నని వివరించారు. కృష్ణ వద్దకు వెళ్లి ఆశీస్సులు మాత్రమే తీసుకున్నామని తెలిపారు.

Mohan Babu
MAA Elections
Open Heart With RK
Tollywood
  • Loading...

More Telugu News