Nagachaitanya: సమంతతో వైవాహిక బంధాన్ని ముగిస్తున్నా: నాగచైతన్య అధికారిక ప్రకటన

Nagachaitanya announced he will depart from marital bond with Samantha

  • సమంత, తాను విడిపోతున్నామన్న నాగచైతన్య
  • భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని వెల్లడి
  • అభిమానులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి
  • సోషల్ మీడియాలో ప్రకటన

టాలీవుడ్ లో అందమైన జోడీగా పేరుపొందిన నాగచైతన్య, సమంతలు విడిపోతున్నారంటూ గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. ఇప్పుడదే నిజమైంది. సమంతతో తన వైవాహిక బంధాన్ని ముగిస్తున్నానని నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. సామ్ తో విడిపోతున్నానని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

చాలా చర్చలు, ఆలోచనల తర్వాత భార్యాభర్తలుగా కొనసాగలేమన్న నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. దశాబ్దకాలానికి పైగా స్నేహబంధాన్ని కలిగివుండడం అదృష్టంగా భావిస్తామని, తమ అనుబంధానికి అదే ప్రాతిపదిక అని నాగచైతన్య వివరించారు. ఈ కష్టకాలంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు తమకు మద్దతుగా నిలవాలని, తమ ఏకాంతాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. మీ తోడ్పాటుకు ధన్యవాదాలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.

'ఏ మాయ చేసావే' చిత్రంలో తొలిసారి కలిసి నటించిన నాగచైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. 2017లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలో క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో వీరు రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. గత కొన్నినెలలుగా చై, సామ్ వేర్వేరుగా ఉంటున్నారని, వీరి కాపురం సజావుగా సాగడంలేదని కథనాలు వచ్చాయి. అనేక సందర్భాల్లో వీరు జంటగా కనిపించకపోవడం కూడా ఆ కథనాలకు బలం చేకూర్చింది. ఇటీవల సోషల్ మీడియాలో తన పేరు చివర అక్కినేని ఇంటిపేరును సమంత తొలగించడం తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News