Congress: పంజాబ్ కాంగ్రెస్ లో మరో కీలక పరిణామం!
- పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిని మార్చాలని అధిష్ఠానం యోచన
- హరీశ్ రావత్ ను తొలగించేందుకు కసరత్తులు
- ఆయన స్థానంలో రాజస్థాన్ మంత్రికి బాధ్యతలు
పంజాబ్ కాంగ్రెస్ లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్ చార్జిని మారుస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఇన్ చార్జిగా ఉన్న హరీశ్ రావత్ స్థానంలో రాజస్థాన్ రెవెన్యూ శాఖ మంత్రి హరీశ్ చౌదరిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్పందించిన ఆయన.. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
పంజాబ్ సీఎంగా చరణ్ జిత్ సింగ్ నియామకంతో పార్టీలో ఘర్షణ వాతావరణం సద్దుమణిగిందనుకున్నా.. ఆ తర్వాత మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ నుంచి తప్పుకుంటాననడం, పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.
ఈ సమయంలోనే పార్టీ పరిశీలకుడిగా హరీశ్ చౌదరిని అధిష్ఠానం నియమించింది. సీఎం, సిద్ధూ మధ్య రాజీ కుదర్చడంలో హరీశ్ చౌదరి కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ లో పార్టీ వ్యవహారాలను హరీశ్ చౌదరికి అప్పగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.