Revanth Reddy: నేడు దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు పాదయాత్ర.. మమ్మల్ని రెచ్చగొట్టకండి: రేవంత్ రెడ్డి
- నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఆందోళన కార్యక్రమాలు
- 65 రోజులపాటు కొనసాగింపు
- డిసెంబర్ 9న ముగింపు
- లాఠీ తగిలినా ముందు తనకే తగులుతుందన్న రేవంత్
కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి తెలంగాణలో విద్యార్ధి, నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. 65 రోజులపాటు ఈ ఆందోళనలు కొనసాగుతాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనుంది. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు దిల్‌సుఖ్ నగర్ లోని రాజీవ్ చౌక్‌లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద దాన్ని ముగించనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు కాంగ్రెస్ చేపడుతున్న నిరసన ర్యాలీలో లాఠీలు తగిలినా, తూటాలు తగిలినా ముందు తనకే తగులుతాయని చెప్పారు.
గాంధీ జయంతి సందర్భంగా తాము శాంతియుత నిరసనలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు పాదయాత్ర ఉండనుందని స్పష్టం చేశారు. ఇందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా సహకరించాలని ఆయన కోరారు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టకూడదని ఆయన చెప్పారు.