Air India: 'టాటా గ్రూపు చేతికి ఎయిరిండియా' అంటూ వచ్చిన కథనాలను ఖండించిన కేంద్రం
- అమ్మకానికి ఎయిరిండియా
- బిడ్డింగ్ రేసులో టాటా గ్రూప్
- ఎయిరిండియా టాటాల పరమైందంటూ కథనాలు
- కేంద్రం ఆమోదం తెలుపలేదన్న పెట్టుబడుల విభాగం
నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియాను బిడ్డింగ్ లో టాటా గ్రూపు చేజిక్కించుకున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, అందులో నిజంలేదని స్పష్టం చేసింది. ఎయిరిండియా బిడ్డింగ్ లో టాటా గ్రూపు విజేతగా నిలిచినట్టు వచ్చిన కథనాలను ఖండించింది.
68 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటాల పరమైందంటూ జాతీయ మీడియాలో నేడు కథనాలు వచ్చాయి. రూ.43 వేల కోట్ల నష్టాలతో నడుస్తూ గుదిబండలా మారిన ఎయిరిండియాను కేంద్రం వదిలించుకునే ప్రయత్నం చేయగా, స్పైస్ జెట్ తదితర సంస్థలు పోటీపడగా చివరికి టాటా సన్స్ నెగ్గిందని ఆ కథనాల్లో పేర్కొన్నారు.
తాజాగా, దీనిపై కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి సోషల్ మీడియాలో స్పష్టత నిచ్చారు. ఎయిరిండియా బిడ్డింగ్ పూర్తయినట్టు వచ్చిన కథనాలు పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బిడ్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదని, కేంద్రం నుంచి ఏదైనా నిర్ణయం వస్తే మీడియాకు అధికారికంగా ప్రకటిస్తామని వివరించారు.