Revanth Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’: ప్రకటించిన రేవంత్‌రెడ్డి

Congress Telangana chief revanth reddy announce war on kcr

  • ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ రూ. లక్ష బాకీ పడ్డారు
  • నిరుద్యోగ భృతి ఇస్తారో, లేదో కేసీఆర్ చెప్పాలి 
  • కేజీ నుంచి పీజీ ఉచిత విద్య గాల్లో కలిసిపోయింది 
  • మరో రెండు రోజుల్లో హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటన

రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యార్థులు, యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిన్న గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ లక్ష రూపాయల చొప్పున బాకీ పడ్డారని ఆరోపించారు.

వివిధ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని బిశ్వాల్ కమిటీ నివేదించినా కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని అన్నారు. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరుతో కేసీఆర్‌పై యుద్ధం ప్రకటిస్తున్నట్టు చెప్పారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబరు 9 వరకు కాంగ్రెస్ నేతృత్వంలో చేపట్టనున్న కార్యక్రమాలను తెలంగాణ సమాజం ఆశీర్వదించి విజయవంతం చేయాలని కోరారు.

నెలకు రూ. 3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చారని, రెండేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇంతకీ, నిరుద్యోగ భృతి ఇస్తారో, లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య కూడా గాల్లో కలిసిపోయిందన్నారు.

అక్టోబరు 2న హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్ నుంచి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి విగ్రహం (కొత్తపేట) వరకు  పాదయాత్ర చేస్తామన్నారు. ఆయన స్ఫూర్తితోనే ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ ప్రారంభిస్తామన్నారు.  అలాగే, మరో ఒకటి రెండు రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తమ అభ్యర్థిని ప్రకటిస్తామని రేవంత్ తెలిపారు.

  • Loading...

More Telugu News