Navjot Singh Sidhu: అప్పుడు టీమిండియాను ఎలా వదిలేశాడో.. సిద్ధూపై అమరీందర్ కామెంట్స్
- 1996లో ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సిద్ధూ
- అదే సిద్ధూ అసలు బుద్ధి అంటూ అమరీందర్ కామెంట్స్
- పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి పనికిరాడని తేల్చేసిన వైనం
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో ‘నేను ముందే చెప్పానా?’ అంటూ మాజీ సీఎం అమరీందర్ సింగ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ క్రమంలో మరోసారి సిద్ధూ రాజీనామాపై అమరీందర్ పెదవివిప్పారు. కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నికవడం, మళ్లీ రెండు నెలల్లో రాజీనామా చేయడం అంతా సిద్ధూ డ్రామా అంటూ అమరీందర్ మండిపడ్డారు. ఇది సిద్ధూ చంచల మనస్తత్వానికి నిదర్శనమని చెప్పారు.
ఈ సందర్భంగా 1996లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను కూడా ప్రస్తావించారు. అప్పుడు భారత జట్టును అకస్మాత్తుగా వదిలి సిద్ధూ వచ్చేయడాన్ని గుర్తుచేశారు. తాను సిద్ధూని చిన్నతనం నుంచి చూస్తున్నానని, అదే సిద్ధూ నిజమైన వ్యక్తిత్వమని చెప్పారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాన్ని పాలించడానికి సిద్ధూ పనికిరాడని తేల్చిచెప్పారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఐఎస్ఐ చీఫ్ బజ్వాతో సిద్ధూకి స్నేహం ఉందని, అలాంటి వ్యక్తి పంజాబ్ సీఎం అయితే దేశానికే ప్రమాదమని హెచ్చరించారు. తన హయాంలో మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా చాలా వరస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని సిద్ధూను విమర్శించారు.