karthik: మైదానంలో ఢిల్లీ ప్లేయర్ అశ్విన్, కోల్‌కతా కెప్టెన్ మోర్గాన్ మధ్య గొడవ.. పూర్తి వివరాలు తెలిపిన దినేశ్ కార్తీక్
- ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ, కోల్‌కతా మధ్య మ్యాచ్
- పంత్ ను రనౌట్ చేసే అవకాశం చేజారిన వైనం
- రాహుల్ త్రిపాఠి విసిరిన బంతిని పట్టుకోవడంలో అయ్యర్ విఫలం
- బంతి పంత్‌కు తగలడంతో పరుగుకు పిలిచిన అశ్విన్
- బ్యాట్స్‌మన్‌కు బంతి తాకాక ఎలా పరుగు తీస్తారని మోర్గాన్ గొడవ
ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఢిల్లీ టీమ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఆటగాళ్ల మధ్య గొడవ చెలరేగింది. వెంకటేశ్ అయ్యర్ వేసిన 19వ ఓవర్‌లో రిషభ్ పంత్‌ను రనౌట్ చేసే అవకాశం చేజారడమే ఇందుకు కారణం.
19వ ఓవర్‌లో ఐదో బంతిని పంత్ హిట్ చేసి పరుగు తీస్తోన్న సమయంలో ఫీల్డింగ్ చేస్తోన్న రాహుల్ త్రిపాఠి విసిరిన బంతిని పట్టుకుని పంత్ రెండో పరుగు తీయకుండా చేయడంలో అయ్యర్ విఫలం అయ్యాడు. అదే సమయంలో రెండో పరుగు కోసం.. క్రీజులో ఉన్న ఢిల్లీ బ్యాట్స్‌మన్ అశ్విన్ ప్రయత్నించడం, ఆ సమయంలో అతడు అయ్యర్‌కు అడ్డు రావడంతో కోల్‌కతా కెప్టెన్ మోర్గాన్ కు ఆగ్రహం తెప్పించింది.
దీంతో అశ్విన్, మోర్గాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అలాగే, కోల్‌కతా పేసర్ టిమ్ సౌథీ కూడా అశ్విన్‌తో గొడవ పడ్డాడు. దీంతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఇందులో జోక్యం చేసుకుని అశ్విన్‌ను దూరంగా తీసుకెళ్లడంతో వివాదం ముగిసింది.
దీనిపై కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపాడు. ఫీల్డింగ్ చేస్తోన్న రాహుల్ త్రిపాఠి బంతి విసిరాడని, అది బ్యాట్స్ మన్ పంత్‌ను తాకి కిందపడిందని వివరించాడు. దీంతో అశ్విన్ పరుగు కోసం పంత్‌ను పిలవడంతో ఇద్దరూ పరుగు తీశారని, అయితే మోర్గాన్ దీనిపై అభ్యంతరాలు తెలిపాడని చెప్పాడు.
ఎందుకంటే బ్యాటర్ లేక ప్యాడ్‌ను బంతి తాకితే పరుగు తీయడం సరికాదని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మోర్గాన్ అనుకున్నాడని తెలిపాడు. అందుకే గొడవ చెలరేగిందని చెప్పాడు. బ్యాటర్ చేసిన పని గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇది తన అభిప్రాయం మాత్రమే అని చెప్పాడు.