Vijay: విజయ్ పేరుతో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీని రద్దు చేసిన ఆయన తండ్రి
- 'విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ తండ్రి
- తన అనుమతి లేకుండా పేరు వాడుకుంటున్నారంటూ విజయ్ ఫిర్యాదు
- చెన్నై హక్కుల కోర్టులో కూడా పిటిషన్ దాఖలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ 2020లో 'విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు.
దీంతో తన అనుమతి లేకుండానే తన పేరును వాడుతున్నారంటూ తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై విజయ్ కేసు పెట్టారు. తన తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని గతంలోనే విజయ్ స్పష్టం చేశారు. అయితే, తన పేరుతో కార్యకలాపాలను సాగిస్తూ, తన పేరును వాడుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు, తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హక్కుల కోర్టులో కూడా విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను రద్దు చేశామని తెలుపుతూ కోర్టులో విజయ్ తండ్రి పిటిషన్ దాఖలు చేశారు.