C.Ramachandraiah: పవన్ మళ్లీ టీడీపీతో కలవబోతున్నాడు... అందుకే ఈ న్యూసెన్స్!: వైసీపీ నేత సి.రామచంద్రయ్య

C Ramachandraiah slams Pawan Kalyan

  • జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని పవన్ భరించలేకపోతున్నాడు
  • టీడీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాడు
  • పవన్ వ్యాఖ్యలు ఆయన పరిణతి లేమికి, అజ్ఞానానికి నిదర్శనం
  • అందుకే రెండు చోట్లా ఓడించారన్న రామచంద్రయ్య

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ మళ్లీ టీడీపీతో కలుస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాడని ఆరోపించారు. టీడీపీ అధినాయకత్వంతో లోపాయికారీ ఒప్పందం నేపథ్యంలోనే ఇటీవల సీఎం జగన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడాడని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని పవన్ భరించలేకపోతున్నాడని విమర్శించారు.

సినిమా టికెట్ల వ్యవహారంలో పవన్ వ్యాఖ్యలు ఆయన పరిణతి లేమికి, అజ్ఞానానికి నిదర్శనం అని సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. పవన్ నానాటికీ ఏపీలో ఓ న్యూసెన్స్ లా మారుతున్నాడని, జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలకు దానివల్ల ఏం ఒరిగిందని ప్రశ్నించారు. వామపక్షాలతో స్నేహం చేసి, కొన్ని నెలలకే బీజేపీతో చేయి కలిపిన పార్టీని ఎక్కడా చూడలేదని అన్నారు. పరస్పర విరుద్ధ ప్రకటనలతో జనాన్ని పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్న పవన్ ను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకున్నారు కాబట్టే రెండు చోట్లా ఓడించారని రామచంద్రయ్య పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మాలని సినీ రంగ పెద్దలే కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారదర్శకమైన విధానాన్ని రూపొందించిందని వివరించారు. అయితే, ఈ విధానం వస్తే బ్లాక్ మార్కెటింగ్ కుదరని, ఇష్టంవచ్చినట్టు టికెట్ల రేట్లు పెంచుకోవడం సాధ్యం కాదన్న అక్కసుతోనే సీఎం జగన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు.

C.Ramachandraiah
Pawan Kalyan
Online Ticketing
CM Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News