Telangana: గులాబ్ ఎఫెక్ట్... మంగళవారం సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కారు

Telangana govt announced holiday on Tuesday

  • తెలంగాణపై విరుచుకుపడిన గులాబ్
  • తీరం దాటిన తర్వాత అతి భారీ వర్షాలు
  • అతలాకుతలమైన తెలంగాణ
  • రాగల 48 గంటల్లో అతి భారీ వర్ష సూచన

గులాబ్ తుపాను తీరం దాటిన తర్వాత తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా హైదరాబాదు నగరంలో కుండపోత వర్షాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రేపు (మంగళవారం) సెలవు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాంతో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఓ ప్రకటన చేసింది.

అటు, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షబీభత్సం నెలకొనడంతో మంత్రి హరీశ్ రావు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా, మండల, గ్రామాల వారీగా సంబంధిత అధికారులు ఆయా కేంద్రాల్లో ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కంట్రోల్ రూమ్ ను ఆశ్రయించేవారి పట్ల సత్వరమే స్పందించాలని అన్నారు.

కాగా, రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో, ఈ నెల 30న జరగాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈ సెట్) అక్టోబరు 23కి వాయిదా వేస్తున్నట్టు  కన్వీనర్ తెలిపారు. అంతేకాదు, మంగళవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్ కమిటీ సమావేశం కూడా వాయిదా పడింది.

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 28, 29న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. మిగిలిన తేదీల్లో జరిగే పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, వాయిదాపడిన పరీక్షల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News