Gulaba Cyclone: 'గులాబ్' తుపాను మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం విషయమై జగన్ కీలక ఆదేశాలు
- గులాబ్ తుపాను కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- తుపాను బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష
- మృతుల కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశం
గులాబ్ తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తుపానుపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా హాజరయ్యారు. సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే... విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని జగన్ చెప్పారు. తుపాను కారణంగా మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల సాయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు.