Brahmin Corporation: బ్రాహ్మణులను బీసీల్లో చేరుస్తున్నారనే ప్రచారాన్ని నమ్మకండి: ఏపీ డిప్యూటీ స్పీకర్
- బ్రాహ్మణ కార్పొరేషన్ పై విమర్శలు చేయవద్దు
- బీసీ కార్పొరేషన్ ద్వారానే బ్రాహ్మణ కార్పొరేషన్ కొనసాగుతుంది
- పథకాల అమలును బీసీ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది
బ్రాహ్మణ కార్పొరేషన్ పై రాజకీయపరమైన విమర్శలు చేయడం సరికాదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్ లో చేర్చడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బ్రాహ్మణులను బీసీల్లో చేరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు.
బీసీ కార్పొరేషన్ ద్వారానే బ్రాహ్మణ కార్పొరేషన్ ను గతంలో ఏర్పాటు చేశారని... ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారో అదే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే పథకాల అమలును మాత్రం బీసీ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని అన్నారు.
పేద బ్రాహ్మణులకు నవరత్నాల ద్వారా అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నామని కోన రఘుపతి చెప్పారు. నవరత్నాల పరిధిలో లేని పథకాలను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందిస్తామని తెలిపారు. దీనిపై అవగాహణ లేని వారు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కచ్చితంగా జరుగుతుందని అన్నారు. వచ్చే సాధారణ బడ్జెట్ లోపే కొత్త జిల్లాల ఏర్పాటు ఉండొచ్చని చెప్పారు.