Perni Nani: ఆ రోజు మన వదినమ్మ మాటలు వినుంటే ఈ బాధ ఉండేది కాదు: పవన్ పై పేర్ని నాని వ్యాఖ్యలు
- ఏపీ రాజకీయాల్లో సినిమా టికెట్ల అంశం
- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల ఆగ్రహం
- ఓ రేంజిలో విరుచుకుపడిన పేర్ని నాని
- తీవ్రస్థాయిలో విమర్శలు
ఏపీ రాజకీయాల్లో సినీ పరిశ్రమ అంశం రాజుకుంది. సాయితేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో జరగ్గా, పవన్ కల్యాణ్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాని ఫలితమే ఏపీ మంత్రులు వరుసగా పవన్ కల్యాణ్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా పేర్ని నాని జనసేనాని వ్యాఖ్యలను దీటుగా తిప్పికొట్టారు.
"ప్రభాస్ కండలు పెంచి, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సులు చేస్తూ కష్టపడితే తమకు డబ్బులు వస్తున్నాయని మా పీకే గాడు చెబుతున్నాడు. ఆ డబ్బులను మేం తీసుకుని లోన్లు తెచ్చుకోవడానికి వాడుకుంటామని అంటున్నాడు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల వ్యాపారం, మటన్ వ్యాపారం చేస్తుంది... మా ఇండస్ట్రీ సంగతి మీకెందుకోయ్ సన్నాసుల్లారా, శుంఠల్లారా అంటూ నిన్న వ్యాఖ్యలు చేశాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం దివాలా తీసింది, మా డబ్బులతో లోన్లు తెచ్చుకుంటున్నారు అంటూ విమర్శలు చేశాడు.
ఏం నాన్నా... నీ డబ్బులతో మేం ప్రభుత్వాన్ని నడిపేస్తున్నామా? అసలు వకీల్ సాబ్ కు ఎంత ఖర్చయిందో, ఎక్కడ తీశారో ఓ థియేటర్ యజమాని చెప్పాడు. నీ సినిమాకు ఏపీలో వచ్చిన రూ.55 కోట్లతో మా ప్రభుత్వం నడుస్తుందా? నీ రూ.55 కోట్లతో మాకు ఏ బ్యాంకులు రుణాలు ఇస్తాయి పిచ్చి తండ్రీ?" అంటూ ఎద్దేవా చేశారు.
తామందరం కూడా చిరంజీవి గారికి పెద్ద అభిమానులం అని పేర్ని నాని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగామని, కాలేజీ ఎగ్గొట్టి, చిరంజీవి కటౌట్లకు దండలు వేసి, రిలీజ్ రోజునే రెండుసార్లు షోలు చూసేవాళ్లమని వివరించారు.
"మేం చిరంజీవి గారికి పెద్ద అభిమానులం. చిరంజీవిని అన్నయ్యా అని, సురేఖమ్మను వదినమ్మా అని పిలుచుకుంటాం. ఏరా బాబూ పీకేగా... ఆ రోజు మన వదినమ్మ చెప్పిన మాట వినుంటే ఇప్పుడీ బాధ ఉండేదా! చదువుకోరా బాబూ అని చిలక్కి చెప్పినట్టు చెప్పింది. ఇప్పుడీ పిచ్చిమాటలు, పిచ్చిలెక్కలు చెప్పే బాధ ఉండేది కాదు. 2018లో తమరు అజ్ఞాతవాసి అనే సినిమా తీశారు. అప్పుడు నీ బాస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు రూ.63 కోట్లు వచ్చింది. ఆ రూ.63 కోట్లతో ప్రభుత్వం నడుస్తుందా?" అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
"2003 నుంచే ఆన్ లైన్ టికెటింగ్ కోసం సినీ రంగం ప్రయత్నాలు చేసింది. అప్పటినుంచి చంద్రబాబును, రాజశేఖర్ రెడ్డిని చిత్రసీమ ప్రముఖులు కలవని రోజులేదు. దానికి సంబంధించి అర్జీలు కూడా ఉన్నాయి. అసలు పవన్ కల్యాణ్ కు ఆన్ లైన్ టికెటింగ్ తో ఏంటి సంబంధం?' అంటూ నిలదీశారు.
"ఇదేనా నీకు గురువులు నేర్పిన సంస్కారం? మీడియా ఉంటే కాళ్లకు నమస్కారం పెడతావు, మీడియా లేకపోతే గురువులను కనీసం పట్టించుకోవు.. ఇదేనా నీ విజ్ఞత, నీ భాష, వాడే పదజాలం?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఆన్ లైన్ టికెటింగ్ అంటే.... పోర్టల్ ను మాత్రమే ప్రభుత్వం నడుపుతుంది. టికెట్లను సినిమా థియేటర్ల వాళ్లే అమ్ముకుంటారు. ఇవాళ వసూలైన సొమ్ము రేపు పొద్దున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్ వే ద్వారా వారి వారి ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ఏ ఒక్క థియేటర్ యాజమాన్యంతో అయినా మాట్లాడావా? థియేటర్లు రెడ్లకు ఉన్నాయి, రాజులకు ఉన్నాయి... బీసీలకు కూడా సినిమా హాళ్లు కట్టివ్వు, ముస్లింలకు కట్టివ్వు అంటూ ఎంత వ్యంగ్యంగా మాట్లాడావు. కాలం కలిసొస్తే సీఎం జగన్ సినిమా హాళ్లు కూడా కట్టిస్తారు. కేవలం పెద్ద కులాల వాళ్లకే సినిమా హాళ్లు ఉండాలన్నట్టుగానే నీ భాష ఉంది.
మేం ఆన్ లైన్ లో టికెట్లు అమ్మితే నీకు డబ్బులు రావు అనే కదా నీ బాధ. అలా కాకుండా బ్లాక్ లో టికెట్లు అమ్మితే, ఆ డబ్బులో నీకు నిర్మాతలు వాటా ఇస్తే అప్పుడు బాగుంటుందా? ఇదే కదా నీ కాకి గోల! పారదర్శకంగా మేం మంచి విధానం అమలు చేస్తే నీకేమైంది? రోజుకు 4 షోలు వేయాలని ప్రభుత్వం చెబితే నీకు అభ్యంతరం ఏంటి?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"అసలు ఏం సాధించావని నువ్వంటే మాకు అసూయ. నీ సినిమాల్లో ఎన్ని హిట్లు అయ్యాయో చెప్పు. నీకంటే చిన్నవాళ్లు, కుర్రాళ్లు తీస్తున్న సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. వాళ్లకు వస్తున్న కలెక్షన్లలో 60 పైసలు కూడా నీ సినిమాలకు రావడంలేదు. నువ్వు డబ్బులు తీసుకుంటే మేం ఎందుకు ఏడుస్తాం? నీకు చాలా ఖర్చులు ఉంటాయి, చెల్లింపులు ఉంటాయి, భరణాలు ఉంటాయి.. మాకేం ఇబ్బంది!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.