gaddi annaram: అర్ధరాత్రి నుంచి మూతపడనున్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్
- బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలింపు
- అక్టోబరు 1 నుంచే అక్కడ క్రయ విక్రయాలు
- ప్రభుత్వ నిర్ణయంతో వర్తకులు, హమాలీల ఆందోళన బాట
హైదరాబాద్ లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ఈ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి దానికి తాళాలు వేసేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మార్కెట్‌ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అక్టోబరు 1 నుంచి ఇక అక్కడ క్రయ విక్రయాలు ప్రారంభమవుతాయి. అక్కడ అన్ని హంగులతో విశాలమైన మార్కెట్‌ను ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నారు.
గడ్డి అన్నారం మార్కెట్ కొన్ని ఎకరాల్లోనే ఉండడంతో పాటు అది దశాబ్దాల కిందటి నిర్మాణం కావడంతో అందులో సదుపాయాలు లేవని ప్రభుత్వం అంటోంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంతో వర్తకులు, హమాలీలు ఆందోళన బాట పట్టారు. తమతో చర్చించకుండానే అధికారులు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. 35 ఏళ్ల పాటు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తు చేసుకున్నారు.
ఇక్కడ ఆసుపత్రి కడతామని ప్రభుత్వం చెబుతోందని, తమను ఎటువంటి సదుపాయాలు లేని చోటుకి తరలిస్తుండడం బాధాకరమని చెప్పారు. వేరే చోట మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు అంటున్నారని, దాన్ని తాము పరిశీలించామని, అక్కడ ఎటువంటి సదుపాయాలూ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నుంచి తమ వ్యాపారాలను తరలించబోమని తెగేసి చెబుతున్నారు.