Malladi Vishnu: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవీపై ఎమ్మెల్యే మల్లాది ఫైర్.. ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’ అంటూ ఆగ్రహం

YCP MLA Malladi Vishnu fires on pdf mlc IV

  • ఈ నెల 22న ఐటీఐ ఉద్యోగుల సంఘం 12వ రాష్ట్ర మహాసభలు
  • జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని ఐవీ ఆగ్రహం
  • జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి మీకు లేదని ఫైర్
  • సోషల్ మీడియాలో మల్లాది వీడియో వైరల్

పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ)పై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డోంట్ టాక్.. వాటీజ్ దిస్ నాన్సెన్స్!’ అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్ర పారిశ్రామిక శిక్షణ కేంద్రాల ఉద్యోగుల సంఘం 12 రాష్ట్ర మహాసభలు ఈ నెల 22న విజయవాడలోని ఎంబీవీకేలో నిర్వహించింది. మల్లాది విష్ణు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఐవీ తదితరులు హాజరయ్యారు. కొందరు మంత్రులను ఆహ్వానించినా వారు రాలేదు.

ఈ సందర్భంగా ఐవీ మాట్లాడుతూ.. ప్రస్తుత పాలకులు ఉద్యోగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఐటీఐలలో సగానికి పైగా కాంట్రాక్ట్ ఇన్‌స్ట్రక్టర్లే ఉన్నారని, ఐటీఐలకు ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ఐటీఐని ఏర్పాటు చేస్తామని మాత్రం చెబుతోందని విమర్శించారు.

ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ ఉద్యోగులకు డీఏలను, పీఆర్సీలను సకాలంలో చెల్లిస్తామని ఊదరగొట్టారని, సీపీఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా వాటి సంగతి అతీగతీ లేదని ఐవీ వాపోయారు.

 అనంతరం మాట్లాడిన మల్లాది ఎమ్మెల్సీ ఐవీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. జగన్ పాదయాత్రలో మైకులు, స్పీకర్ బాక్సులు పెట్టుకుని తిరిగిన విషయం ఈ సమావేశంలో అవసరమా? అని ప్రశ్నించారు. మైకు దొరికింది కదా అని ఎలా పడితే అలా మాట్లాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే అనుకూలంగా ఉన్న మీడియాను పిలిచి చెప్పుకోవాలని సూచించారు. ‘‘డోంటాక్’.. ఎమ్మెల్సీ అని గౌరవం ఇస్తున్నా’’ అని ఆగ్రహంతో ఊగిపోయారు.

ఎమ్మెల్సీ లక్ష్మణరావు తమకు అనేక సలహాలు ఇస్తుంటారని, కానీ ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’ అని ఫైరయ్యారు. మంత్రులకు పనిలేదు, అత్తారింటికి దారేది.. అంటూ నాన్‌సెన్స్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇది పీఆర్సీ గురించి మాట్లాడే సభ కాదని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే స్థాయి, అర్హత ఉందా అసలు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పొగిడితే ఏం కాదని, కానీ అనవసరంగా మాట్లాతానంటే కుదరదని హెచ్చరించారు. కాగా, మల్లాది విష్ణువర్ధన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాఖ్యల వీడియో సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News