Corona Virus: కరోనాతో ఇంట్లో మరణించినా పరిహారం.. ధ్రువీకరణ పత్రం మాత్రం తప్పనిసరి
- కరోనా నిర్ధారణ అయిన 25 రోజుల్లోపే 95 శాతం మరణాలు
- నెల రోజుల తర్వాత మరణించినా కరోనా పరిహారం
- జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా రూ. 50 వేల పరిహారం
- పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందాకే పరిహారంపై స్పందిస్తామన్న తెలంగాణ
కరోనా బారినపడి ఇంట్లోనే మరణించినా పరిహారం అందించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అయితే, బాధిత వ్యక్తి కరోనాతో మరణించినట్టు వైద్యుడి ధ్రువీకరణ పత్రం అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. సాధారణంగా కరోనా సోకి నిర్ధారణ అయిన 25 రోజులలోపే 95 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. నిర్ధారణ అయిన తేదీ నుంచి నెల రోజుల్లోపు సంభవించే మరణాలను పరిహారం కోసం పరిగణనలోకి తీసుకోనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
అలాగే, కొన్ని సందర్భాల్లో నెల రోజులు దాటిన తర్వాత కూడా కరోనా కారణంగానే మరణిస్తున్నారు. ఇలాంటి మరణాల్లో వైద్యుడి ధ్రువీకరణ పత్రం ఉంటే వాటికి కూడా పరిహారం ఇవ్వాలని సూచించింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్రం ఇది వరకే నిర్ణయించగా తాజాగా, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. కేంద్రం పంపిన మార్గదర్శకాలపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.. ఇవి ప్రాథమిక మార్గదర్శకాలేనని, పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందిన తర్వాతే పరిహారంపై దృష్టిసారిస్తామని స్పష్టం చేసింది.