Kamala Harris: మోదీ ఇచ్చిన కానుకతో మురిసిపోయిన కమలా హారిస్
- అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన
- కీలక సమావేశాలతో మోదీ బిజీ బిజీ
- కమలా హారిస్, క్వాడ్ దేశాధినేతలతో భేటీలు
- కళాకృతులను కానుకలుగా ఇచ్చిన వైనం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, క్వాడ్ దేశాధినేతలతో ఆయన సమావేశమయ్యారు. కాగా, కమలా హారిస్ తో భేటీ సందర్భంగా మోదీ ఓ అరుదైన కానుకను ఆమెకు అందజేశారు. అది ఓ చెక్క కళాఖండం. ఈ కళాకృతిని అందుకున్న కమలా హారిస్ మురిసిపోయారు. అందుకు కారణం... ఆ చెక్క జ్ఞాపికను రూపొందించింది కమలా హారిస్ తాత పీవీ గోపాలన్. పీవీ గోపాల్ హస్తకళల నిపుణుడు. తన తాత రూపొందించిన కళాఖండాన్ని తనకు కానుకగా ఇవ్వడం పట్ల కమలా హారిస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ... వారణాసిలో తయారైన మీనాకారీ చదరంగం బోర్డును కూడా కమలా హారిస్ కు అందించారు. అంతేకాదు, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కు వెండితో రూపొందించిన మీనాకారీ నౌక బొమ్మను బహూకరించగా, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపుచెక్కతో రూపొందించిన బుద్ధ ప్రతిమను కానుకగా ఇచ్చారు.