Corona Virus: వచ్చే ఏడాదికి కరోనా వైరస్ సాధారణ జలుబుగా మారిపోతుంది: వైద్య నిపుణులు
- ఆరు నెలల క్రితం కంటే పరిస్థితి మెరుగ్గా ఉందన్న ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్
- వయసు పైబడిన వారిలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని వ్యాఖ్య
- వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే కొద్దీ బలహీనపడుతుందన్న ప్రొఫెసర్
కరోనా వైరస్... సాఫీగా నడిచిపోతున్న జనజీవనాన్ని ఒక్కసారిగా తల్లకిందులు చేసిన మహమ్మారి. ప్రాణాంతకమైన ఎన్నో జబ్బులు ఉన్నప్పటికీ... యావత్ ప్రపంచం ఈ మహమ్మారికే వణికిపోయింది. జనాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా ఎవరికి వారు ఐసొలేట్ అయిపోయిన పరిస్థితి. బంధువులు, స్నేహితులు, ఉద్యోగాలు తదితరాలన్నీ ఈ మహమ్మారి ముందు తలదించేశాయి.
బతికి ఉంటే చాలు భగవంతుడా అని ప్రపంచ ప్రజలు దేవుడిని ప్రార్థించే పరిస్థితిని ఈ మహమ్మారి తీసుకొచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ వైరస్ ప్రభావం కాస్త నెమ్మదిస్తోంది. ప్రజల దైనందిన జీవితాలు మళ్లీ క్రమంగా సాధారణ స్థాయికి వస్తున్నాయి. అయితే రాబోయే శీతాకాల పరిస్థితులు వెళ్లిపోతే వైరస్ మరింత బలహీనపడుతుందనే అభిప్రాయాలను వైద్య నిపుణులు వ్యక్తపరుస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జాన్ బెల్ కరోనా గురించి మాట్లాడుతూ, యూకేలో ఆరు నెలల క్రితం కంటే ఇప్పటి పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. వయసు పైబడిన వారిలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని అన్నారు. అయితే ఈ మరణాలన్నీ కరోనా కారణంగానే సంభవించాయనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేమని వ్యాఖ్యానించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే కొద్దీ అది బలహీన పడుతుందని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కరోనా వైరస్ సాధారణ జలుబుగా మారిపోతుందని చెప్పారు.