Kolkata Knight Riders: డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి మరోషాక్.. కోల్‌కతా చేతిలో చిత్తు

Mumbai losses another match decreased their spot

  • ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం
  • చెలరేగిన త్రిపాఠీ, వెంకటేశ్ అయ్యర్
  • పాయింట్ల పట్టికలో ఎగబాకిన కోల్‌కతా
  • తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత విజయం

డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఈసారి కలిసి రావడం లేదు. ఐపీఎల్ రెండో దశ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఓటమికి రోహిత్ శర్మ లేకపోవడమే కారణమని సరిపెట్టుకున్నా, గత రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఉన్నప్పటికీ మరోమారు దారుణ పరాభవం ఎదుర్కొంది.

రాహుల్ త్రిపాఠీ విధ్వంసానికి తోడు వెంకటేశ్ అయ్యర్ చెలరేగడంతో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. ముంబై నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

శుభ్‌మన్ గిల్ 13 పరుగులకే వెనుదిరిగినా, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వెంకటేశ్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠీ 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ మోర్గాన్ 7, నితీశ్ రానా 5 (నాటౌట్) పరుగులు చేశారు. కోల్‌కతా కోల్పోయిన మూడు వికెట్లూ బుమ్రాకే దక్కాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై తొలి బంతి నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును పరుగులు పెట్టించారు. రోహిత్ 30 బంతుల్లో 4 ఫోర్లతో 33, డికాక్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశారు. వీరి దూకుడుకు స్కోరు 200 పరుగులు దాటుతుందని భావించారు. అయితే, వీరిద్దరూ అవుటయ్యాక స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. బ్యాటర్లు వరుసపెట్టి పెవిలియన్‌కు క్యూకట్టారు.

సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14), కృనాల్ పాండ్యా (12) దారుణంగా నిరాశ పరిచారు. పొలార్డ్ మాత్రం 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేసి జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయడంలో సాయపడ్డాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి మోర్గాన్ సేన ముందు ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఉంచి వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా బౌలర్లలో ప్రసీద్ కృష్ణ, ఫెర్గ్యూసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సునీల్ నరైన్ ఓ వికెట్ తీసుకున్నాడు.

సునీల్ నరైన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా, ముంబై ఆరో స్థానానికి పడిపోయింది. నేడు షార్జాలో బెంగళూరు-చెన్నై మధ్య ఐపీఎల్ 35వ మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News